అధిక వడ్డీ మాయలో రూ.25 కోట్ల మోసం… బాధితులను రోడ్డున పడేసి లేడీ పరార్

అధిక వడ్డీ మాయలో రూ.25 కోట్ల మోసం… బాధితులను రోడ్డున పడేసి లేడీ పరార్  

హైదరాబాద్: అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికి పలువురి నుంచి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్న ఓ మహిళ చివరికి వారిని మోసం చేసి పరారైన ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపింది.బద్దం జ్యోతిరెడ్డి అనే మహిళ అధిక వడ్డీ ఆశ చూపిస్తూ పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా సుమారు రూ.25 కోట్లకు పైగా వసూలు చేసిన తర్వాత ఆమె కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా, తన ఇంటిని ముందుగా ఒకరికి అగ్రిమెంట్ చేసి, అనంతరం అదే ఇంటిని మరొకరికి సేల్ డీడ్ చేసి మోసం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకోవడంతో పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు బాధితులు తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు.

ఇప్పటికే పలువురు బాధితులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. శనివారం కూడా ఒక బాధితుడు రూ.46 లక్షలు అప్పుగా ఇచ్చినా తిరిగి ఇవ్వడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మహేశ్ మాట్లాడుతూ, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న జ్యోతిరెడ్డిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Post a Comment

0 Comments