కేటీఆర్ జోలికి వస్తే నాలుక చీరేస్తాం..: కవిత మాలోత్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఎంపీ కవిత మాలోత్ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సభలో వేలాదిగా తరలివచ్చిన రైతుల సమక్షంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ పేరిట చేసిన హామీల అమలుపై ప్రశ్నించారని కవిత మాలోత్ పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న తమ నాయకుడిపై కాంగ్రెస్ నేతలు అసభ్యకర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఇలాంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాజకీయాల్లో హుందాతనం పాటించాలని, వ్యక్తిగత దూషణలు మానుకోవాలని సూచించారు.అలాగే, ఒకరి పుట్టుక గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ నాయకులు తమ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవాలని, అప్పుడు నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని హెచ్చరించారు.ఈ సమావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వై. సతీష్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
