షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి పట్టాలు తప్పింది..
TGWNEWS : ఒడిశాలో రైలు ప్రమాదం సంభవించింది. చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ బాలేశ్వర్ జిల్లా బహనాగ్ రైల్వేస్టేషన్లో ఆగివున్న గూడ్స్ ను ఢీకొట్టింది. బాలాసోర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 7 బోగీలు పట్టాలు తప్పగా, 50 మంది వరకు గాయపడ్డారు. ప్రమాదం దాటికి బోగీలు పల్టీలు కొట్టగా, ప్రయాణీకులు చెల్లాచెదురుగా పడిపోయారు. చిమ్మ చీకటి కావడంతో ప్రయాణీకులు ప్రాణ భయంతో ఆర్తనాదాలు చేశారు.గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం.తక్షణమే ఘటనా స్థలానికి చేరుకోవాలని రాష్ట్ర మంత్రి ప్రమీలా మల్లిక్, స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (ఎస్‌ఆర్‌సీ)ని ఒడిశా సీఎం ఆదేశించారు. ఒడిశా ప్రత్యేక రిలీఫ్ కమీషనర్ (SRC), సీనియర్ అధికారులు హేమంత్ శర్మ, బల్వంత్ సింగ్, అరవింద్ అగర్వాల్, అగ్నిమాపక సేవల డీజీతో పాటు సహాయక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాజా రైలు ప్రమాదంతో బాలాసోర్ జిల్లా, చుట్టుపక్కల ఉన్న మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను అలర్ట్ చేశారు అధికారులు. ప్రస్తుతానికి మూడు ఎన్టీఆర్ఎఫ్ టీమ్ లు, నాలుగు ODRAF టీమ్స్ సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు.


0 Comments