వరంగల్ విమానాశ్రయంపై షాక్ నిర్ణయం… రన్‌వే కేవలం 2.5 కి.మీ!

వరంగల్ విమానాశ్రయంపై షాక్ నిర్ణయం… రన్‌వే కేవలం 2.5 కి.మీ! 

వరంగల్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వాలు, ఇప్పుడు రన్‌వే పొడవును కేవలం 2.5 కిలోమీటర్లకు పరిమితం చేయడం చర్చనీయాంశంగా మారింది. పెద్ద డొమెస్టిక్ మరియు అంతర్జాతీయ (వైడ్ బాడీ) విమానాలు దిగాలంటే కనీసం 2.9 కిలోమీటర్ల రన్‌వే అవసరమని విమానయాన నిపుణులు చెబుతుండగా, 2.5 కి.మీ.తో సరిపెట్టడం వరంగల్ ప్రజలను నిరుత్సాహానికి గురిచేసింది.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ ఎయిర్‌పోర్టును 3.9 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో నిర్మించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అలా నిర్మించి ఉంటే ప్రపంచంలోని అతిపెద్ద విమానాలకూ ల్యాండింగ్ సౌకర్యం ఉండేదని అప్పట్లో పేర్కొన్నారు. టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టులో కూడా 2.9 కిలోమీటర్ల రన్‌వే అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. ఇతర విమానాశ్రయాలతో పోలిస్తే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. బేగంపేట విమానాశ్రయం రన్‌వే పొడవు 3.2 కి.మీ. ఉండగా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) రన్‌వే 4.2 కి.మీ.గా ఉంది. పక్క రాష్ట్రంలోని విజయవాడ విమానాశ్రయం రన్‌వే 3.36 కి.మీ. కాగా, విశాఖపట్నం విమానాశ్రయం రన్‌వే 3.0 కి.మీ.గా ఉంది. తాజాగా కేంద్ర మంత్రులు సమావేశం అనంతరం ఇచ్చిన ప్రకటనలో వరంగల్ రన్‌వే పొడవు 2.5 కి.మీ.గా పేర్కొనడం గమనార్హం. దీనర్థం వరంగల్ విమానాశ్రయం ప్రధానంగా చిన్న, మధ్య తరహా డొమెస్టిక్ విమానాలకు మాత్రమే అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరంగల్‌ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేయాలంటే, అంతర్జాతీయ కనెక్టివిటీ కీలకం. అలాంటప్పుడు రన్‌వే పరిమితి భవిష్యత్ విస్తరణకు అడ్డంకిగా మారుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వం రన్‌వే పొడవుపై పునరాలోచన చేసి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని వరంగల్ ప్రజలు కోరుతున్నారు.

Post a Comment

0 Comments