అదో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం

 అదో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం

TGW NEWS/మెదక్‌: పాపన్నపేట:తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు. పచ్చని ప్రకృతి నడుమ వెలసిన ఏడుపాయల వనదుర్గాభవానీ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఇంతటి ప్రాశస్థ్యం కలిగిన ఆలయంలో కార్యనిర్వాహక అధికారి(ఈవో), ఛైర్మన్‌ మధ్య వైరుధ్యం తారా స్థాయికి చేరింది. ఇన్నాళ్లు బహిర్గతం కానీ విభేదాలు... అమ్మవారి బంగారం, వెండి తరలింపు ఘటనతో రచ్చకెక్కాయి. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో అభిప్రాయ భేదాలు బయటపడ్డాయి.  పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి శివారులోని ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయ కార్యకలాపాల నిర్వహణ అంతా కార్యనిర్వాహణ అధికారి(ఈవో) ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. ఆలయం దేవాదాయశాఖ పరిధిలో ఉండడంతో ప్రభుత్వం పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం 14 మంది సభ్యులతో ఇటీవల పాలకవర్గం ఏర్పాటైంది. పాపన్నపేట మండలం గాజులగూడెంకు చెందిన బాలాగౌడ్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పాలకవర్గానికి రెండోసారి అవకాశం కల్పించడంతో గతనెల 7న ప్రమాణస్వీకారం చేశారు.

బదిలీ అయినాతిరిగి అక్కడికే

ఈవో సార శ్రీనివాస్‌ గతేడాది జనవరిలో బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రవికుమార్‌ను నియమించగా.. విధుల్లో చేరారు. రాజకీయ అండదండలతో తిరిగి సార శ్రీనివాస్‌ ఈవోగా బాధ్యతలు చేపట్టడం గమనార్హం. దీంతో రవికుమార్‌ సిద్దిపేట జిల్లాకు బదిలీ అయ్యారు. అనంతరం గతేడాది జూన్‌లో బాలగౌడ్‌ ఛైర్మన్‌గా పాలకవర్గం ఏర్పాటైంది. ఆరంభంలో ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ కొద్ది నెలల తర్వాత వైరం రాజుకుంది. ఈవో లేకుండానే బాలాగౌడ్‌ గత నెల 7న రెండోసారి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం గమనార్హం. వీరి మధ్య ఉన్న విభేదాల కారణంగా ప్రస్తుతం రాజగోపురం వద్ద ఉన్న ఈవో ఆలయాన్ని కొండపై ఉన్న పాత ఈవో కార్యాలయానికి మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఈవో, ఛైర్మన్‌ల మధ్య సఖ్యత లేకపోవడంతో ఆలయ సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. ఇరువురి మధ్య వారు నలిగిపోతున్నారు. ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు.

జాతర నుంచి వైరం

ఈ ఏడాది జాతర నుంచి వైరం ముదిరింది. జాతరలో అలంకరణ, నదీపాయలో శివలింగం ఏర్పాటు సమయం నుంచి ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. మరోవైపు ఆలయానికి అవసరమైన ప్రతి చిన్న వస్తువు ఈవోనే కొనుగోలు చేయడం విమర్శలకు తావిస్తోంది. సిబ్బంది అందుబాటులో ఉన్నా... వారిని నమ్మకుండా తనే స్వయంగా తీసుకురావడం గమనార్హం. ఈవోపై ఛైర్మన్‌ బాలాగౌడ్‌ పలుమార్లు ఎమ్మెల్యే పద్మ, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. వారు ఈవోకే మద్దతు తెలిపినట్లు తెలిసింది. దీంతో ఇరువురు రాజకీయ అండదండలతో సై అంటే సై అంటున్నారు.

నలిగిపోతున్న సిబ్బంది

అమ్మవారి బంగారం, వెండి తరలింపు ఘటనతో ఈవో, ఛైర్మన్‌ మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. పాలకవర్గానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, చెక్‌ పవర్‌ ఈవోకే ఉండడంతో లెక్కల వివరాలు తెలియడం లేదని ఛైర్మన్‌ బాలాగౌడ్‌ శనివారం దేవాదాయశాఖ ఆర్‌జేసీకి ఫిర్యాదు చేశారు. కానీ బంగారం, వెండి తీసుకురావడంపై ఛైర్మన్‌కు సమాచారం ఇచ్చినట్లు ఈవో సార శ్రీనివాస్‌ వివరించారు. మొత్తానికి ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాల కారణంగా అటు సిబ్బంది నలిగిపోవడంతో పాటు ఆలయ అభివృద్ధిపై పరోక్షంగా ప్రభావం పడుతోంది.

Post a Comment

0 Comments